ముందుమాట
తెలుగుభాషలో శతక ప్రక్రియ విశిష్టమైనది. ఒక ఛందోవిశేషం తీసుకొని అన్ని పద్యాలూ వ్రాయాలి. వాటి సంఖ్య ఒక వంద కావాలి. ఆ పద్యాలన్నింటికీ ఒకే విధమైన ముగింపు ఉండాలి. ఆ ముగింపు ఒక పదం కావచ్చును - ఏదో కేశవా అనో కృష్ణా అనో శివా అనో ఉండవచ్చును. లేదా ఒక పదబంధం కావచ్చును శ్రీగిరి మల్లికార్జునా అన్నట్లుగా, దాశరథీ కరుణాపయోనిధీ అన్నట్లుగా. ఒక్కొక్క సారి ఆ ముగింపు ఏకంగా ఒక పాదం అంతా పరచుకొని ఉండవచ్చును హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అన్నట్లుగా. అరుదుగా ఒక పాదం కన్నా హెచ్చుగానే ఉండవచ్చును కూడా భావనారాయణ భక్తపోషణ మదాత్మవిలక్షణ రక్షణేక్షణా అన్నట్లుగా. ఇలా వందో అంతకు మిక్కిలిగానో పద్యాలు వ్రాసి ఒక కృతిని నిర్మిస్తే అది ఒక శతకం అనిపించుకుంటుంది. మరలా ఈశతకాలు రకరకాలు. ముప్పాతికమువ్వీశం శతకాలు భక్తిపూర్వకమైన రచనలు. మిగిలిన వాటిలో అధికభాగం నీతిబోధలు. నిజానికి ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా శతకాలు వస్తునే ఉన్నా, ఇప్పటికీ మన తెలుగుకవులకు శతక నిర్మాణం మీద మక్కువ యేమీ తగ్గలేదు. సరికదా ఇటీవల మరింత హెచ్చింది అనిపిస్తున్నది. విచారించవలసిన విషయం ఏమిటంటే రానురాను శతకాల లోని భాష, భావశబలత, సుబోధకత అన్న ముఖ్యమైన మ...