అగస్త్యలింగశతకము

అందమైన ఈ‌ అగస్త్యలింగశతక కర్త తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యవార్లం గారు అని నాకు లభించిన 1935వ సంవత్సరంలో బెజవాడలో ముద్రించబడిన ప్రతిముఖపత్రం విదితం చేస్తోంది. ఇది ఒక శివపరమైన రమ్యమైన సీసపద్య శతకం.

శతకం అన్నాక ఒక మకుటం ఉండాలి కదా. ఈ‌శతకంలో ఒకటికంటే ఎక్కువే మకుటాలు కనిపించటం అనేది ఒక విశేషం. ఐనా శతకపద్యాలలోని ఎత్తుగీతి చివరి పాదంలో ఈమని అగస్త్యలింగ అన్న సంబోధన మాత్రం తప్పకుండా ఉంది. కాబట్టి ఆ ఒక్క ముక్కనే మనం‌ మకుటంగా గ్రహించాలి. విస్తరించి చూసిన పక్షంలో మనకు కనిపించే మకుటాలు

  •     ఈమని యగస్త్యలింగ బాలేందుసంగ
  •     ఈమని యగస్త్యలింగ పుష్పేషుభంగ
  •     కలుషచయభంగ యీమనగస్త్యలింగ

కవి గారి యింటి పేరు తాడికొండ. ఈ తాడికొండ గుంటూరు జిల్లాలో ఉంది. కవి గారు తెనాలి దగ్గర ఉన్న ఈమని గ్రామంలో శా.శక 1776వ (క్రీ.శ 1855) సంవత్సరంలో జన్మించారు. వీరు భారద్వాజగోత్రీకులైన బ్రాహ్మణులు, శైవులు. దినదినమూ 21600 నామజపం చేసే షట్కాల శివపూజా దురంధరులైన ఈ కవి గారు సంస్కృతాంధ్రభాషల్లో మంచి పాండిత్యంతో పాటుగా సంగీతశాస్త్ర మంత్రశాస్త్రాల్లో కూడా మంచి ప్రతిభ కలవారు. ఈ‌ శతకప్రతిలో చివరన కవి గారు రచించిన శివకీర్తనలు కూడా ఉన్నాయి.

ఈ‌ శతక కర్త మల్లికార్జున అయ్యం వార్లు విరచించన గ్రంథాలు

  •     హరిశ్చంద్రోపాఖ్యానం (అచ్చతెలుగు ప్రబంధం, అముద్రితం)
  •     కూకద మారయ్య కథ (శివకథ, అముద్రితం)
  •     శ్రియాళుని కథ ( శిరియాళుని కథ?  శివకథ, అముద్రితం )
  •     రౌద్ర సత్తెక్క కథ  (శివకథ, అముద్రితం)
  •     మైథున రామయ్య కథ (శివకథ, అముద్రితం)
  •     సిధ్దేశ్వర శతకం
  •     అగస్త్యలింగ శతకం
  •     భజన కీర్తనలు
  •     రామేశ్వరయాత్రా తటస్థ దేవతా పంచరత్నాలు
  •     అష్టకములు


ఈ శతకాన్ని పరిశీలిస్తే మనకు దీనిలో చాలా రసవంతమూ సులభమూ శ్రుతిసుభగమూ ఐన భాషతో వివిధప్రక్రియల్లో చక్కని కవిత్వం కనిపిస్తుంది. మంచి ధారాశుధ్ధికల ద్రాక్షాపాకంలో రచించబడిన ఈ‌శివభక్తి పూర్వకమైన శతకం మనోహరంగా ఉంది.

ఈ‌శతకంలో మొదటి పద్యం
మందారమకరంద బృందారవింద సం
    క్రందనాశ్వమృగేంద్ర రమ్యదేహ
నారీకృతస్వాంగ హారీకృతభుజంగ
    దూరీకృతానంగ దురితభంగ
దారుకారణ్యసంచారమౌనివ్రజ
    దారవారాభికతారరూప
శ్రీశార్చితా శర్వరీశావతంస కీ
    నాశావలేపవినాశ యీశ
భర్గ కృతసర్గ మౌనిరాడ్వర్గవినుత
విశ్వరూప సనాతన వేదవేద్య
శయధృతకురంగ రాజతశైలసంగ
ఈమని యగస్త్యలింగ పుష్పేషుభంగ
 
అలా సంస్కృతసమాసభూయిష్టమైన ధోరణిలో చెప్పి వెంటనే తెలుగుదనం ఉట్టిపడే ఈ రెండవపద్యాన్ని చెప్తున్నారు చూడండి.

పులితోలు మొలకట్టు తెలిగట్టు నీపట్టు
    నిప్పు నుదుటబొట్టు నింగిజుట్టు
కేల ముమ్మొనవాలు తోలు నెమ్మెయి శాలు
    మేన జక్కని యాలు మినుకువాలు
తపసులు నీదంద తరచుగా మెడనిండ
    పున్కలదండ పెన్బూది నిండ
గాలిమేతరు పేరు నేల చెల్వగు తేరు
    నీకు సొంపగు సౌరు మాకు జూడ
కరము బీతగు మది బేసికంటి వేల్ప
నీకు గావించెద జొహారు నీకుమారు
బ్రోవు మెప్పుడు గొడవలు బొడమకుండ
ఈమని యగస్త్యలింగ బాలేందు సంగ

ఈ శతకంలో ఒక సర్వలఘుసీసపద్యం ఒకటి ఉంది. వృత్తాలు కావు కాబట్టి తెలుగుఛందస్సుల్లో పూర్తిగా సర్వలఘుపద్యం వ్రాయటం వీలుగా ఉంటుంది.  వీరు వ్రాసిన ఈసర్వలఘుసీసంలో మకుటానికి మాత్రం మినహాయింపు.  అలాగే ఒక నిరోష్ట్యమూ ఒక ద్విపదకందగర్భమైన పద్యమూ కూడా ఉన్నాయి ఈశతకంలో.  శతకం ముగింపుకు వస్తున్న దశలో షట్చక్రాలలో శివతత్త్వనిరూపణమూ చేస్తారు కవి గారు. ఈయన చేసిన ద్విపదకందగర్భసీసం చూదాం.

భుజగసంచయహార పురదైత్యమార గ
    జముఖాత్మజ వియత్కచభర భర్గ
కనకాద్రికోదండ కలితేందుఖండ మ
    నసిజహరణ రమానాథబాణ
శ్రితజాలపరిపాల శిక్షితకాల ధృ
     తశధృతికపాల తరణిశాల
నివసితకైలాస నిగమార్వభాస ర
    విశశాంకశుచినేత్ర విమలగాత్ర
కమలకరమౌనినుతపదకమలయుగళ
పాశనివహఖండన శ్రితపాక మనత
విదళన విలసత్కమనీయ వృషభవరతు
రగ విరించినుతా యంచు రక్తి దలతు
ఈమనియగస్త్యలింగ బాలేందు సంగ

ఇందులో మంజరీ ద్విపదలను సీసభాగంలో పాదాదినుండి చూడవచ్చును. 
 
భుజగసంచయహార పురదైత్యమార
కనకాద్రికోదండ కలితేందుఖండ
శ్రితజాలపరిపాల శిక్షితకాల
నివసితకైలాస నిగమార్వభాస

ఈశతక పద్యంలో ఉన్న కందం ఎత్తుగీతిలో ఉంది
 
కమలకరమౌనినుతపద
కమలయుగళపాశనివహఖండన శ్రితపా
క మనతవిదళన విలసత్
కమనీయ వృషభవరతురగ విరించినుతా

ఈశకతక కర్త చక్కని రసవంతమైన పద్యాలను చదివి అనందించవలసిందే. హాస్యరసాంచితమైన ఈపద్యాన్ని చూడండి.

పెండ్లికాలంబున పెద్దలందరు గూడి
    ప్రవర జెప్పుమటంచు బల్కునపుడు
దానికి తగిన యుత్తర మియ్య లేకయ  
    మౌనవ్రతంబును బూనినావు
అత్తమామలు దాని నరయకయే నీకు
    పిల్ల నెట్లిచ్చిరో ప్రేమమీర
కులగోత్రములను లోకులు విచారింపక
    సంబంధమున కెట్లు సమ్మతింతు
రవని వడ్డించు వాడాప్తుడైన బంతి
కొనను గూర్చున్న వానికి కొరతలేదు
గౌరి నినుగోర తక్కిన వారిదేమి

ఈమని యగస్త్యలింగ బాలేందు సంగ
 
కవిగారి శైలి మనోహరంగా ఉండటం వలన కంఠగతం చేసుకొని శివుని మ్రోల తప్పక పఠింపదగిన పద్యాలు కొల్లలుగా ఉన్నాయి. మచ్చుకు రెండు మూడు.
 
నీమన్కి నాయున్కి నిత్యంబు నొక్కటి
    గా జేయుమయ్య నీకరుణ యుంచి
నీచూపు నాచూపు నిత్యంబు నొక్కటి
    గా జేయుమయ్య నీకరుణ యుంచి
నీరూపు నారూపు  నిత్యంబు నొక్కటి
    గా జేయుమయ్య నీకరుణ యుంచి
నీవు నే ననకుండ   నిత్యంబు నొక్కటి
    గా జేయుమయ్య నీకరుణ యుంచి
నీవు నేనను భావంబు నీల్గు దనుక
భక్తి మాత్రంబు నీయందు    బర్వజేయు
మయ్య మరియొక్కటియు వేడనయ్య నిన్ను
కలుషచయభంగ ఈమన్యగస్త్యలింగ

కైలాసవాసాయ కామితఫలదాయ
    ఫాలేక్షణాయ తుభ్యం నమోస్తు
శమనగర్వహరాయ చంద్రఖందధరాయ
    పార్వతీశాయ తుభ్యం నమోస్తు
ఓంకారరూపాయ ఉరగేంద్రహారాయ
    పాశహరాయ తుభ్యం నమోస్తు
మునిజనస్తోత్రాయ మురవైరిమిత్రాయ
    భవహరణాయ తుభ్యం నమోస్తు
భక్తజనరక్షణాయ తుభ్యం నమోస్తు
స్ఫటికమణిసన్నిభాయ తుభ్యం నమోస్తు
అనుచు నిన్ను నుతించెద నహరహంబు
నీమని యగస్త్యలింగ పుష్పేషుభంగ

వేదాంతవేద్యాయ విమలాంతరంగాయ
    మౌనిహృన్నిలయాయ తే నమోస్తు
శాంతాయ స్వప్రకాశాయ నిర్లేపాయ
    జ్ఞానస్వరూపాయ తే నమోస్తు
వృషభేంద్రవాహాయ విషధరాభరణాయ
    భేనఖండధరాయ తే నమోస్తు
పవనాసనాధీశ పర్యంకవిశిఖాయ
    భానుమధ్యస్థాయ తే నమోస్తు
భానుశశివహ్నినేత్రాయ తే నమోస్తు
దీనజనపారిజాతాయ తే నమోస్తు
అనుచు నిను వినుతించెద నఘవిదూర
యీమని యగస్త్యలింగ బాలేందుసంగ 

ఈశతకం చివర ఉన్న మంగళాశాసనం చాలా రమ్యంగా ఉంది చూడండి, దీనినీ‌ కంఠంగతం చేసుకొనవచ్చును.

సంగతరజతాద్రిశృంగ శంకర సర్వ
    మంగళాధవ నీకు మంగళంబు
గంగానదీఝురీరంగజ్జటాజూట
    లింగరూపా నీకు మంగళంబు
భృంగినాట్యకృపానుషంగ భక్తహృదబ్జ
    భృంగాత్మకా నీకు మంగళంబు
అంగసంభవభంగ తుంగపుంగవరాట్తు
    రంగ ధూర్జటి నీకు మంగళంబు
మహిత మంగళకర నీకు మంగళంబు
మధురసారంగధర నీకు మంగళంబు
మంగళాత్మక యిదె నీకు మంగళంబు
ఈమని యగస్త్యలింగ బాలేందుసంగ
 

Comments

  1. మంచి కార్యక్రమాన్ని స్వీకరించారు. చాల సంతోషం. శతక పరిచయం క్లుప్తంగా, చక్కగా విషయప్రధానంగా ఉంది. మీరిచ్చిన లింకు ద్వారా శతకాన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకున్నాను. ధన్యవాదాలు. ఆ శతక ముద్రణకు ద్రవ్యాన్ని సమకూర్చిన వారు మా వరంగల్లు వారు కావడం ఆనందాన్ని కించిత్తు గర్వాన్ని కలిగించింది. మీరు ప్రకటించబోయే శతక పరిచయాలన్నీ తప్పక చదువుతూ వెంట వెంట స్పందిస్తూ ఉంటాను.

    ReplyDelete
    Replies
    1. శంకరయ్య గారూ, మీ ప్రోత్సాహానికి సదా కృతజ్ఞుడను. ఎన్నో ఎన్నెన్నో శతకాలు మరుగున పడిపోయాయి. ఇంకా ఎన్నెన్నో అసలు వెలుగులోనికి రానేలేదేమో. వీటిలో తప్పకుండా ఎన్నో అందమైనవీ ఉండే ఉంటాయి. కేవలం పరిచయం మాత్రమే చేయగలను లభ్యం ఐన శతకాలను. ప్రజలు చదివి శతకసాహిత్యాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

      Delete

Post a Comment

Popular posts from this blog

ప్రత్యక్షరామచంద్రశతకము

ముందుమాట

అమరనారేయణ శతకము