ముందుమాట

తెలుగుభాషలో శతక ప్రక్రియ విశిష్టమైనది.

ఒక ఛందోవిశేషం తీసుకొని అన్ని పద్యాలూ వ్రాయాలి. వాటి సంఖ్య ఒక వంద కావాలి. ఆ పద్యాలన్నింటికీ ఒకే విధమైన ముగింపు ఉండాలి. ఆ ముగింపు ఒక పదం కావచ్చును - ఏదో కేశవా అనో కృష్ణా అనో‌ శివా అనో ఉండవచ్చును. లేదా ఒక పదబంధం కావచ్చును శ్రీగిరి మల్లికార్జునా అన్నట్లుగా, దాశరథీ‌ కరుణాపయోనిధీ అన్నట్లుగా. ఒక్కొక్క సారి ఆ ముగింపు ఏకంగా ఒక పాదం అంతా పరచుకొని ఉండవచ్చును హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అన్నట్లుగా. అరుదుగా ఒక పాదం కన్నా హెచ్చుగానే ఉండవచ్చును కూడా భావనారాయణ భక్తపోషణ మదాత్మవిలక్షణ రక్షణేక్షణా అన్నట్లుగా. ఇలా వందో అంతకు మిక్కిలిగానో పద్యాలు వ్రాసి ఒక కృతిని నిర్మిస్తే అది ఒక శతకం అనిపించుకుంటుంది.

మరలా ఈశతకాలు రకరకాలు. ముప్పాతికమువ్వీశం శతకాలు భక్తిపూర్వకమైన రచనలు. మిగిలిన వాటిలో అధికభాగం నీతిబోధలు. 

నిజానికి ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా శతకాలు వస్తునే ఉన్నా, ఇప్పటికీ‌ మన తెలుగుకవులకు శతక నిర్మాణం మీద మక్కువ యేమీ తగ్గలేదు. సరికదా ఇటీవల మరింత హెచ్చింది అనిపిస్తున్నది. విచారించవలసిన విషయం ఏమిటంటే రానురాను శతకాల లోని భాష, భావశబలత, సుబోధకత అన్న ముఖ్యమైన మూడు లక్షణాలూ నానాటికీ‌ తీసికట్టు అవుతున్నాయి. దీనికి కారణం ఆధునిక కవులు సంప్రదాయకవిత్వంలో తగినంతగా చేయితిరుగకుండానే ఉత్సాహం ఒక్కటే అర్హతగా శతకాలు గీకి అచ్చువేసి జనం మీదకు వదులుతున్నారు. జనం చదువుతున్నారా అని అడగకండి. అసలు తెలుగు చదివే వాళ్ళే తక్కువ అందులో  సంప్రదాయధోరణి కవిత్వం చదివే‌వాళ్ళ సంఖ్య మరీ తక్కువ. ఐనా చక్కని చదివి సంప్రదాయకవిత్వాన్ని చదివి ఆనందించేవారు ఇంకా బాగానే ఉన్నారు.

తెలుగులో‌ శతకాలను ఇన్నీ‌అన్నీ అని చెప్పరాదు. వినువీధిలో చుక్కల సంఖ్యలాగా లెక్కపెట్టటం మహాకష్టం.

ఈ‌ప్రయత్నం ఉద్దేశం అందుబాటులో ఉన్న కొన్ని శతకాలను సమీక్షించటం. కొన్ని వందల శతకాలను సమీక్షించాలీ అంటే ఆపని లఘుసమీక్షల ద్వారానే చేయాలి. లేకపోతే పెద్ద పురాణం అంత ఐపోయి జనం చదువలేరు.

ఈ లఘు సమీక్షలో ఏమేమీ చూడాలి ముఖ్యంగా అని ఒక ప్రణాళిక వేసుకోవాలి మొట్టమొదట.

  • శతక ఛందస్సు
  • శతక మకుటం
  • మకుటం గురించి విశేషాలు
  • కవి గురించి
  • కవి కాలం గురించి 
  • భాషా సౌందర్యం
  • విషయవిస్తృతి
  • భావశబలత
  • పఠనీయత
    • ధారాశుధ్ధి
    • కాఠిన్యత
    • భాషాశుధ్ధి వగైరా
  • ఉదాహరణకు కొన్ని పద్యాలు
  • ఇతర విశేషాలు
    • ప్రచురణ కర్తల గురించి
    • పండితాభిప్రాయాల విషయం
    • కవి ఇతరకృతుల గురించి ప్రస్తావనలు
    • స్థలపురాణాది విశేషాలు
  •  లభ్యత
    • ప్రస్తుతం ప్రచారంలో ఉన్నదా
    • ప్రస్తుత ముద్రణలో ఉన్నదా 

 నాకున్న అత్యాశ ఒక్కటే. ఈ‌ విస్తృత పరిశీలన పుణ్యమా అని ఐనా మరుగున పడిపోతున్న శతకాలు కొన్నికొన్ని ఐనా మరలా జనం దృష్టికి రావటమే అది.

Comments

Popular posts from this blog

ప్రత్యక్షరామచంద్రశతకము

అమరనారేయణ శతకము