అమరనారేయణ శతకము


అమర నారేయణ కవినే నారేయణ తాత అని అంటారు. ఆయనను నారేయణ యతీంద్రులు అనీ అంటారు. తెలుగు కన్నడ భాషలు రెండింటిలోనూ పలు రచనలు చేసారు. అనేక తత్త్వాలు రచించారు. ఈ అమరనారేయణ శతకం ఆయన తెలుగులో రచించిన శతకం. ఆయన తెలుగులో 144 తత్త్వాలనూ కన్నడంలో 18 తత్త్వాలనూ రచించారు. వీటిని ‘’శ్రీ అమర నారేయణ యతీంద్ర వేదాంత సారావళి‘’ అని పిలుస్తారు.  ఈ కైవారం తాతయ్య గారు 1726లో కొండప్ప, ముద్దమ్మ దంపతులకు కైవారం  నారాయణప్ప పేరున జన్మించి1836-37 సంవత్సరం జ్యేష్ట శుద్ధ తదియ రాత్రి 12 గంటలకు అంటే 110 ఏళ్ళ వయసులో సమాధిగతులైనారు. ఈ కైవారం కర్నాటకలో ఉంది. అక్కడ కైవారం తాత గారి సమాధి మరియు ఆశ్రమం కూడా ఉన్నాయి.
 
అఖిలవేదాంతార్ధప్రతిపాదకమైన యీ అమరనారేయణ శతకం 1959వ సంవత్సరంలో చిత్తూరులో ప్రచురించబడింది. ఈ‌ శతకం సీస పద్యాలలో రచించబడింది.  ఈ శతకానికి మకుటం ఎత్తుగీతిలో చివరి రెండుపాదాలుగా ఉంచబండింది. ఈ మకుటం

అమర నారేయణాచ్యుత హరి ముకుంద
దురితదూరక కైవరపురవిహార

ఈ  మకుటం తేటగీతిలో మాత్రమే యిముడుతుంది కాని ఆటవెలదిలో యిమడదు కాబట్టి ఈశతకం మొత్తం సీసాలకు ఎత్తుగీతిగా తేటగీతులే ఉండటం అనివార్యం. కాని ఈశతకంలో ఆస్పృహ ఎడనెడ తప్పుతూ ఉండటం గమనార్హం. అక్కడక్కడ కొన్ని ఎత్తుగీతుల్లో మొదటి రెండు పాదాలూ ఆటవెలదిలో వస్తాయి. ఈవిధంగా చూస్తే ఈశతకంలో ఛందశ్శుధ్ధి లేదని అనక తప్పదు.

ఈశతకంలో పద్యాలు ద్రాక్షాపాకంలో ఉన్నాయి.  సంస్కృతసమాసాడంబరం కనిపించదు.

ఉదాహరణకు కొన్ని పద్యాలు చూదాం.

సీ॥ శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచు నే
    వేళను మదిలోన వేడుకున్న
గోపాల గోపాల గోపాల యనుచును
    చిత్తంబు నీమీద చేర్చియున్న 
కమలాక్ష కమలాక్ష కమలాక్ష యనుచును
    చూడ్కులు నీమూర్తి జూచుచున్న
పరమాత్మ పరమాత్మ పరమాత్మ యనుచును
    పట్టుగా నిన్ను చేపట్టియున్న
గీ॥ తల్లి దండ్రియు దాతవు దైవమనుచు 
నమ్మినాడను దీనుల సొమ్ము నీవె 
అమర నారేయణాచ్యుత హరి ముకుంద
దురితదూరక కైవరపురవిహార
 
సీ॥ మతము లన్నియు వేరె మార్గంబు నొక్కటె
    వస్త్రబేధము వేరె వస్తువొకటె
శృంగారములు వేరె బంగార మొక్కటి
    పసులవన్నెలు వేరు పాలునొకటి 
జీవబొందులు వేరు జీవుండు నొక్కడె
    జాతినీతులు వేరు జన్మమొకటె
దర్శనంబులు వేరు దైవంబు నొక్కడే
    పుష్పజాతులు వేరు పూజయొకటి
గీ॥ తెలియలేక మనుజులు తెలివి దప్పి
భ్రాంతి విడువక భవరోగబధ్ధులైరి 
అమర నారేయణాచ్యుత హరి ముకుంద
దురితదూరక కైవరపురవిహార
 
సీ॥ నీమీద చిత్తంబు నిలుపుట నావంతు
    నీదాసులను బ్రోవ నీది వంతు
దిక్కు నీవని చాల దెల్పగ నావంతు
    నిజదాసు నేలుట నీదె వంతు
ఇల దేవతాంతరముల వీడ నావంతు 
    నిజదాసు నేలుట నేదె వంతు
మానసమున పూజ మరగుట నావంతు 
    నిజదాసు నేలుట నీదె వంతు
గీ॥ మరణ మెప్పుడొ యెఱుగక మానసమున
వెదకి కనుగొంటి నీకృపావిశదమహిమ
అమర నారేయణాచ్యుత హరి ముకుంద
దురితదూరక కైవరపురవిహార

ఈ క్రిందిపద్యం చూడండి ఎత్తుగీతిలో ఛందస్సాంకర్యం కనిపిస్తున్నది.
 
సీ॥ పచ్చికసుపు మీద పసుజాతికినియాశ
    మార్జాలములకును మాంసమాశ
కలువతూడుల మీద కలహంసముల కాశ
    పక్షిజాతులకును ఫలములాశ
అడవిమృగముల కెల్ల నంధకారంబాశ
    జలజంతువుల కెల్ల జలములాశ
మంచిపుష్పస్పరిశ మధుపసంతతి కాశ
    పురదేవతల కెల్ల పూజలాశ
గీ॥ అల్పనరుల కాశ లన్నింటియందుండు
ఆశ దుఃఖములకు నాలయంబు
అమర నారేయణాచ్యుత హరి ముకుంద
దురితదూరక కైవరపురవిహార
 
మార్మికమైన వేదాంతపరిభాషతో కూడిన పద్యాలు చాలానే ఉన్నాయి. వేదాంతప్రతిపాదకమైన శతకం కదా

సీ॥ ముక్తికి గురుకీలు మూడక్షరంబులు
    మూలము దెలసిన ముక్తుడగును
ఆ మూటి నెవ్వడభ్యాసంబు జేసిన
    నతిసులభంబుగ నాత్మ గనును
అత్మగన్నంతనె ఐక్యసంధానుడై
    ఆకాశపురి జేరి యచట నున్న
దివ్యజ్యోతిని జూచి ధీరుడై యచ్చోట
    బుధ్ధి బాయక హరి పూజయందు
గీ॥ నిలచి భావించు హరిపదనీరజములు
విశ్వగుణముల నెఱుగని విమలబుధ్ధి
అమర నారేయణాచ్యుత హరి ముకుంద
దురితదూరక కైవరపురవిహార
 
చదవటానికి బహుసులభంగా కనిపించే ఈ‌అమరనారేయణ శతకంలోని పద్యాలలో అనేకం గూఢమైన వేదాంతార్ధం కలిగినవి కాబట్టి యోగసాధకులకూ యోగశాస్త్రాధ్యయనం చేసేవారికీ ఆసక్తిని కలిగిస్తాయి తప్పకుండా.

ఈపుస్తకం ముద్రణ గురించి ఒక్కముక్క చెప్పక తీరదు. పరిష్కర్తల అజ్ఞానం వల్లనో అశ్రధ్ధ వల్లనో పద్యాలను సరైన రీతిలో ముద్రించ లేదు. మొదటి పద్యాన్ని సరిగానే ముద్రించారు. మిగిలినపద్యాల ముద్రణావిధానం శుధ్ధతప్పు. సీసపద్యభాగంలోని చివరి చరణంతో ఎత్తుగీతి మొదలౌతున్నట్లు చూపించారు. అలా సీసం చివరి సీసపాదాన్ని ఎత్తుగీతిలోని మొదటి రెండు పాదాలుగానూ ఎత్తుగీతిలోని మొదటి రెండుపాదాలనూ చివరి పాదాలుగానూ చూపారు. అదృష్టవశాత్తు మకుటమే చివరి రెండు పాదాలూ కాబట్టి వీరి విధానం వలన సాహిత్యం ఎగిరిపోలేదని సంతోషించాలి. వీరి ముద్రణ ఎలా ఉందో ఉదాహరణకు

సీ॥ ముక్తికి గురుకీలు మూడక్షరంబులు
    మూలము దెలసిన ముక్తుడగును
ఆ మూటి నెవ్వడభ్యాసంబు జేసిన
    నతిసులభంబుగ నాత్మ గనును
అత్మగన్నంతనె ఐక్యసంధానుడై
    ఆకాశపురి జేరి యచట నున్న
గీ॥ దివ్యజ్యోతిని జూచి ధీరుడై యచ్చోట
బుధ్ధి బాయక హరి పూజయందు
నిలచి భావించు హరిపదనీరజములు
విశ్వగుణముల నెఱుగని విమలబుధ్ధి ॥అమర॥
 
శతకం అంతా ఇలా పొరపాటుగా ముద్రించటం అన్నది చాలా విచారించవలసిన సంగతి! 
 
కైవారం తాత ఆరి ఈశతకం ఎంతవరకూ ప్రవారంలో ఉన్నదో నాకు తెలియదు. కాని ఆయన తత్త్వాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని యూట్యూబులో కనిపిస్తున్నాయి. మంగళంపల్లి వారు కూడా  తాతగారివి ఒకటి రెండు తత్త్వాలు గానం చేసారు.

ముద్రణావిధానంలోని లోపాన్ని ప్రక్కన బెట్టి అందమైన ఈఅమర నారేయణ శతక గ్రంథాన్ని  ఆసక్తి కలవారు తప్పక దిగుమతి చేసుకొని చదివి ఆనందించవచ్చును.

Comments

Post a Comment

Popular posts from this blog

ప్రత్యక్షరామచంద్రశతకము

ముందుమాట