ఆనందరామశతకము

ఈ ఆనందరామ శతకాన్ని రచించిన కవి గారి పేరు మత్తనపెద్ది సత్యనారాయణ.  వీరు సోమవరం వాస్తవ్యులు. ఈ సోమవరం అనే ఊళ్ళు రెండున్నాయి. ఒకటి నందిగామ మండలంలో ఉంది మరొకటి కిర్లంపూడి మండలంలో ఉంది.  ఈశతకాన్ని పరిష్కరించిన అడ్లూరి సీతారామ శాస్త్రి గారు భద్రాచలదేవస్థాన పండితులు. భద్రాచలం నందిగామకు 153కిమీ దూరంలోనూ కిర్లంపూడికి 214కిమీ దూరంలోనూ ఉండటం వలన కవిగారు నివసించిన సోమవరం నందిగామ మండలం లోనిది కావచ్చును. ఈ ఆనందరామ శతకం 1920లో ముద్రితమైనది.

ఈ ఆనందరామశతకం ఒక చక్కని అథ్యాత్మభావనాగుఛ్చం అని చెప్పవచ్చును. రాముడి గుణగణాదులను ప్రస్తుతి చేసే పద్యావళితో పాటు జీవుడి వేదనను వెల్లడించే పద్యాలూ అనేకం వివిధభావాలతో ఇక్కడ ఉన్నాయి.

కవిగారికి మంచి సంస్కృతభాషాపాండిత్యం ఉంది. తెలుగుశతకం ఐనా సరే వీరి మొగ్గు సంస్కృతసమాసాలవైపే ఉన్నదని చెప్పవచ్చును.

ఈ ఆనందరామ శతకం "ఆనందరామా ప్రభో" అన్న శతకంతో విరాజిల్లుతున్నది కాబట్టి ఈశతకంలో వాడబడినవి మత్తేభ శార్దూల వృత్తాలు.

ఈ శతకంలోని పద్యాలు కొంచెం సంస్కృతపదాడంబరసంశోభితాలు అని ముదే చెప్పాను కదా.  ఐనా ఆన్నీ మంచి ధారాశుధ్ధి కలిగి కదళీపాకంలో ఉన్నాయి. కవిగారు పాఠకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కఠినపదాలకు అర్ధాలను కూడా ఇచ్చారు. ఇవి ప్రతిపేజీలోనూ అధస్సూచికలుగా ఇవ్వబడ్డాయి. ఇలా చేసేవారు తక్కువ. ఈకారణంగా పండితసహకారాపేక్ష లేకుండగానే మనబోటి సామాన్యపాఠకులు పద్యాలను చదివి ఆనందించవచ్చును.

శ్రీరామా రమణీయనీలవపుషా సీతామనోనాయకా
ధీరోదారగుణాలవాల విలసద్దేవావళీపూజితా
పారావారగభీర శోభనకరా బ్రహ్మండభాండోదరా
హారాలంకృతకంబుకంఠ విమలా ఆనందరామా ప్రభో
 
నీపాదాంబుజసేవ జేయు నెవడేనిన్ బ్రాహ్మడో శూద్రుడో
పాపాత్ముండొ అసత్యవాదియొ కులభ్రష్టుండొ మిథ్యాత్ముడౌ
గా పాషండమతస్థు డైనను సరే కైవల్యముం బొందు నం
చాపద్భాంధవ నీవె బల్కితివిగా యానందరామా ప్రభో

జగదాధార జగత్సరూప స్వజగజ్జాలోదరా సాదరా
పగధారావిలసత్ర్పవాహనిహతః పంకాత్మపూజార్చితా
నిగమాతీత నిరంజనా నిగమవాన్ నిత్యోదయా నిర్గుణా
ఢ్య గభీరా శరణాగతార్తిహరణా ఆనందరామా ప్రభో

రసజాప్తాన్వయ రాజ రాజమకుటాగ్రస్వామిసంస్తుత్యపా
దసరోజా జలజాప్తనేత్రయుగళాంతవ్యామౌ సత్కృపా
రససోత్సాహసుభక్తరక్షణ రణోగ్రప్రౌఢ ఢంకాఢమా
ఢ్యసమధ్వాన ధణంధణంఢణయశా అనందరామా ప్రభో

కరముల్ గల్గిన సత్ఫలంబునకు నిన్ గాంక్షించి పూజించెదన్ 
చరణంబుల్ గల సత్ఫలంబునకు నీ స్థానంబుకై పోయెదన్ 
వరవక్త్రంబును గన్న సత్ఫలముకై వాంఛించి నిన్ పాడెదన్ 
అరలేకుండగ నెమ్మదిం దలచి నిన్నానందరామా ప్రభో
 
మాయామూల మిదం ప్రథానమన సామాన్యాధిక వ్యక్తిచే 
కాయోత్పత్తికి భాగధేయమున సంకాశించితి న్మర్త్యుగా 
మాయాసంకులపంకచంక్రమణ కర్మార్థంబు సంసారమే 
వ్యాయామంబున ముక్తి గాంచగలనో యానందరామా ప్రభో

పద్యాలలోని కఠిన పదాలకు కవిగారు వివరణలు ఇచ్చారని చెప్పాను కదా.  ఈ మాయామూల మిదం పద్యానికి పుటచివర కవిగారు ఇచ్చిన అర్ధాలున్నాయి. ప్రథానం = ప్రకృతి భాగధేయము = పూర్వకృతమైన శుభాశుభకర్మము చంక్రమణ = పలుసార్లు పరిభ్రమించునది అని వివరణలు.

ఈకవి గారు ఇతర కృతులు ఏమన్నా రచించారో లేదో తెలియదు.

ఆనందరామశతకం బాగుంది. ఆసక్తి కల వారు దిగుమతి చేసుకొని అవశ్యం పఠించి అనందించగలరు.

Comments

  1. మంచి శతకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు. దిగుమతి చేసుకున్నాను.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ప్రత్యక్షరామచంద్రశతకము

ముందుమాట

అమరనారేయణ శతకము