ప్రత్యక్షరామచంద్రశతకము


ఈ ప్రత్యక్షరామచంద్రశతక కర్త గారి పేరు గొట్టిముక్కల కోటయ్య గారు. శతకంలోని 106వ పద్యంలో ఆయన 
 
విలసిత గొట్టుముక్కల కోటయాఖ్యుడన్ 
    రచియించితి శతక రాజమరయ
 
అని చెప్పుకున్నారు.  ఈ కవివర్యులు నివసించిన స్థలకాలాదుల వివరాలు తెలియవు. ఈశతకం 1943లో అచ్చయినదని మాత్రం పరోక్షంగా తెలుస్తున్నది. దొరకిన ప్రతిలో వివరం లేదు.

ఇది ఒక సీసపద్య శతకం. ఈ‌ శతకం మకుటం 

భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర

అని ఉండటం వలన ఈశతకంలోని పద్యాలన్నింటికీ ఎత్తుగీతిగా తేటగీతి మాత్రమే ఉండటం నియతం అవుతున్నది.

ఈ‌శతకంలోని పద్యాలు ద్రాక్షాపాకంలో ఉండి చక్కటి ధారాశుధ్ధితో  ఉన్నాయి. అన్నీ రసరమ్యంగా ఉన్నాయి. కవిగారు శతకం మొదలు పెడుతూనే

సీ॥ అవధరింపు దశర ♦ థాత్మజ నీమీద
సీసశతకము ర ♦ చింతు నేను
ఆంధ్రసంస్కృతనిఘం ♦ ట్వాది కావ్యము లైనఁ
జదివి యెఱుంగని ♦ జడుఁడ గాన
ఛందస్సులందున ♦ సద్యుక్తగణయతి
ప్రాసలక్షణశబ్ద♦ దోషములను
లేశమాత్రంబైన ♦ దేశికుని వలన
మొదలె నేరనియట్టి ♦ మూఢమతిని
తే.గీ॥ బహువిధంబుల మరువక ♦ భక్తి చేత
సంతసంబున నీనామ ♦ స్మరణ జేతు
భక్తవత్సల భాసుర ♦ భద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్ష ♦ రామచంద్ర
 

దొరకిన ప్రతి ముద్రణ కూడా బాగుంది. పద్యాల్లో యతిమైత్రి స్థానం ముందు ప్రత్యేకంగా ఒక ♦ గుర్తును వేసి చూపారు సాధారణ పాఠకుల సౌకర్యార్ధం. ఈ ♦గుర్తుకుఉభయపార్స్వములలోనూ  ఎడముంచి ముద్రించారు కాని అలా చేయటం అంత అవసరం కాదు.

మధురపద్యసంపుటియైన యీ‌శతకంలోని పద్యాలు మచ్చుకు కొన్ని చూపుతున్నాను.

సీ॥ క్రూరవర్తనుడైన ఘోరపాతకుడైన
    జారుడైనను దురచారుడైన
దివసాంతమున నొక్క తేప రామాయని
    మనమున స్మరియించు మనుజునకును
రాకారమును నోట రాగానె దోషంబు
    వారించు తత్ప్రభావంబు వలన
మాకారమును నోట మరి యుచ్చరింపగ
    వాటమైనట్టి కవాటమగుచు
తే.గీ॥ బాపమును జొచ్చ నివదని ప్రకటితముగ
వేదములు బల్కుచున్నవి విదితముగను
భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
 
ఈ శకతం మరింత శ్రధ్ధతో పరిష్కరించవలసి ఉందేమో అనిపిస్తుంది. పైని ఎత్తుగీతి మొదటిపాదం పాఠం సంతృప్తికరంగా లేదు. కొంచెం దిద్దవచ్చును. కవిగారు తమకు పాండితీప్రకర్షలేదని ముందే‌ మనవి చేసారు కాబట్టి పరిష్కర్తలు మరింత శ్రధ్ధవహించవలసి ఉండినది. ప్రకటితముగ విదితముగ అని కించిత్తు పునరుక్తిలాంటిది కవిగారు పాదపూరణం కోసం చేసినా పరిష్కర్తలు చూసి పాఠశుధ్ధి చేయవలసి ఉండినది కదా అనిపిస్తుంది. ఐనా ఇట్టి చిన్నచిన్న దోషాలు పరిగణనీయం కావు. ముఖ్యంగా ఈరసరమ్యమైన శతకంలో.

సీ॥ రామ నీపాదాబ్జరజమహత్త్వంబును
    గౌతమ బ్రహ్మర్షి కాంత యెఱుగు
భూసుతాధవతవ భుజబలమహిమను 
    చండికాలోలుని చాప మెఱుగు 
పరమాత్మ తమ ధనుర్బాణమాహాత్మ్యము 
    వాసవాత్మజుడైన వాలి యెఱుగు 
వనజాక్ష తావక వనమాలమహిమను 
    వాయుసుతుం డాంజనేయు డెఱుగు
తే.గీ॥ రామనామమహిమ నుమారమణు డెఱుగు
నిలను నావంటి దౌర్భాగ్యు డేమి యెఱుగు
భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
 
సీ॥ జయజయ రఘురామ జయ జగదభిరామ
    జయజయ శుభనామ భయవిరామ
జయజయ రణశూర జయశత్రు సంహార
    జయ మేరుసమధీర జయవిహార
జయజయ దశవేష జయ భక్తజనపోష
    జయమౌని హృత్తోష జయవిశేష
జయమన్మథాకార జయమందరోధ్ధార 
    జయ జగదాధార జయవిచార
తే,గీ॥ జయము నీదివ్యనామవిజయము జయము
జయము చేకూర్చి యేలుమా సార్వభౌమ
భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
 
సీ॥ శ్రీరామ నీసేవ జేయుట నావంతు 
    నెనరుతో‌ నన్నేల నీదె వంతు
అపరాథినంచు నిన్నర్ధింప నావంతు
    నేర్పుచే మన్నింప నీదె వంతు
పరుల నేడక నిన్ను ప్రార్థింప నావంతు
    నిరతంబు గాపాద నీదె వంతు
ముదముతో నీకు నే మ్రొక్కుట నావంతు
    నిజముగా దీవింప నీదెవంతు
తే.గీ॥ నమ్మి యాత్మను భజియింప నాదు వంతు
నేడు మరువక రక్షింప నీదె వంతు
భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
 
సీ॥ రామయ్య నీదివ్య నామమంత్రము చేత 
    బూతభేతాళితో బోరవచ్చు
రామయ్య భవదీయ నామమంత్రము చేత
    మొండి గ్రహంబుల జెండవచ్చు
రామయ్య తమ భవ్యనామమంత్రము చేత
    దంతు లుఛ్చాటనల్ దఱుమ వచ్చు
రామయ్య తారకనామమంత్రము చేత
    గట్టుపోతుల నోళ్ళు గట్టవచ్చు
తే.గీ॥ పరభయంబుల నెల్ల గాపాడు ననుచు
భళీర నీనామమంత్రంబు బ్రస్తుతింతు
భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
 
ఈ పద్యం చదివినప్పుడు నరసింహ నీదివ్యనామమంత్రము చేత అన్న ప్రసిధ్ధమైన శతకపద్యం స్ఫురణకు వస్తుంది.
 
సీ॥ దండంబు దండంబు దశకంఠసంహార
    రక్షించు రక్షించు రామచంద్ర
కేల్మోడ్తు కేల్మోడ్తు కిల్బిషధ్వంసకా
    రక్షించు రక్షించు రాఘవేంద్ర
జోహారు జోహారు సుమనసవందితా
    రక్షించు రక్షించు రఘుకులేంద్ర
సాష్టాంగముగ నమస్కారంబు జేసెద
    సుజనౌఘసంరక్ష సుగుణసాంద్ర
తే.గీ॥ శరణు కుంజరపోషణ దురితహరణ
స్తుతి యొనర్చెద మాంపాహి సుస్థిరముగ
భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
 
సీ॥ గుహుడు నీకేపాటి బహుదాస్యమును జేసె 
    శ్రీరామ బహుసంతసించినావు
శబరి నీకేపాటి చాలగా క్షుధతీర్చె 
    శ్రీరామ బహుసంతసించినావు
ఉడుత నీకేపాటి యూడిగంబులు సేసె 
    శ్రీరామ బహుసంతసించినావు
కపులు నీకేపాటి కడుసహాయంబైరి 
    శ్రీరామ బహుసంతసించినావు
తే.గీ॥ చేతనైనంత వరకు నీ సేవ జేతు
సంశయించక ననుబ్రోవు సంతసమున
భక్తవత్సల భాసురభద్రశైల
ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
 
ఈ పద్యం చదివినప్పుడు రామదాసు గారి డాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు అన్న పద్యం గుర్తుకు వస్తుంది.
 
ఇలా పద్యాలు మధురంగా ఉన్నా యండీ శతకంలో.  ఈ ప్రత్యక్షరామచంద్ర శతకం అవశ్యపఠనీయం. అసక్తి కలవారు తప్ప దిగుమతి చేసుకొని పఠించి ఆనందించవచ్చును.


Comments

Post a Comment

Popular posts from this blog

ముందుమాట

అమరనారేయణ శతకము